AparnaKalynam
sreemaparna

 

 ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః
వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః
శ్రీ మదపర్ణా దేవ్యై నమః

బ్రహ్మ పురాణం ఆధారముగా శ్రీ మదపర్ణాదేవి వివాహ చరిత్ర
(బ్రహ్మ పురాణము నుండి అపర్ణా అమ్మ వారి పరిణయ ఘట్టములో కొన్ని ముఖ్యమైన శ్లోకాలు వాటి భావములు - కూర్చినవారు శ్రీమతి కవికొండల శేషు గారు, అంతర్వేది, తూ. గో. జిల్లా, ఆం.ప్ర.)

శ్లో॥ అధ దేవీ సతీయత్తే ప్రాప్తే వైవస్వతే అన్తరే

       మేనాయాం తాముమాం దేవీం జనయామాస శైలరాట్

 

భావము: వైవస్వత మన్వంతరములో మేనకా హిమవంతులకు ఉమ అను పేరుతో పార్వతి జన్మించెను.

పూర్వజన్మలో సతీదేవిగను, తర్వాత జన్మలో ఉమాదేవిగను పార్వతి ప్రఖ్యాతి పొందెను.

 

గిరిజాపుత్రికగా జన్మించిన పిమ్మట శివ పార్వతులకు ఏ విధముగా వివాహము జరిగెనో వివరింపుమని మునులు బ్రహ్మగారిని అడిగిరి.

 

సర్వసిద్ధిప్రదమైన ఉమాశంకరుల కథ చెప్పెదను వినుమని బ్రహ్మగారు చెప్పుట ప్రారంభించెను.

 

హిమవంతుడు పుత్రులకై తపస్సు చేయచుండగా శివుడు ప్రత్యక్షమై ముగ్గురు పుత్రికలను వరముగా ఇచ్చితిని అని అంతర్ధానమయ్యెను. ప్రధమ పుత్రిక పాటల. ద్వితీయ పుత్రిక ఏకపర్ణా. తృతీయ పుత్రిక అపర్ణా. ఈ మువ్వురు శివుని వివాహము చేసుకొనవలెనని ప్రయత్నించుచుండిరి.

 

బ్రహ్మగారు ప్రధమ, ద్వితీయ పుత్రికలకు శివునితో వివాహము జరగదని అపర్ణతో శివుని వివాహము జరగగలదని చెప్పెను. ఈ అపర్ణ ఉమ అను పేరుతో ముల్లోకాలలో కీర్తి పొందును అని చెప్పెను.

 

శ్లో॥ అపర్ణాతు నిరాహారా తాం మాతా ప్రత్యభాషత

       నిషేధయంతీ చోమేతి మాతృస్నేహేన దుఃఖితా

 

భావము: అపర్ణ నిరాహారిగ ఉండిపోయెను. తల్లి బాధతో "ఉ" మా = వద్దు అని నివారించెను. అప్పటి నుండీ పార్వతి ఉమ గా పిలువబడుచున్నది.

 

శ్లో॥ దేవి కింతపసా లోకా స్థాపయిష్యసి శోభనే

       త్వయా సృష్టమిదం సర్వం మా కృత్వా తద్వినాశయ

 

భావము: ఓ దేవీ నీ యొక్క తపస్సుచే లోకములన్ని దద్దరిల్లుచున్నవి. నీచే సృష్టించబడిన ఈ ప్రపంచమును చేయవద్దని ఉమ తల్లి మేనక ప్రార్థించెను.

 

నీవు ఎవరికొరకు తపస్సు చేయుచుంటివో వారే స్వయముగా వచ్చి నిన్ను వరింపగలడని బ్రహ్మగారు చెప్పెను.

 

శ్లో॥ మహేశ్వరః పర్వతలోకవాసీ చరాచరేశః ప్రధమో ప్రమేయః

       వినేందునా మహేంద్ర సమాన వర్చసా విభీషణం రూపమి వాస్టి తోయః

 

భావము: కైలాసవాసి చరాచర ప్రభువు అప్రమేయుడు చంద్రునితో కూడినవాడు, ఇంద్రునితో సమానుడు, మూడవ కన్ను కలవాడు అయిన మహేశ్వరుడే శివుడని పార్వతికి బ్రహ్మ చెప్పెను. నీ తపస్సుకై నీకు అనువైన ప్రదేశముకు వెళ్ళమని బ్రహ్మగారు ఉమకు చెప్పెను.

 

శ్లో॥ తత స్తామ బ్రువనే దేవాః తదాగత్వా తుసుందరీం

       దేవీ శీఘ్రేణ కాలేన దూర్జటి: నీలలోహితః

 

భావము: ఓ సుందరీ! నీవు శీఘ్రముగా దండకారుణ్యమునకు వెళ్లి నీలలోహితుడైన శివుని గూర్చి తపమాచరింపుమని దేవతలు చెప్పిరి.

 

అపుడు పార్వతి

 

శ్లో॥ సభర్తా తవ దేవేశో భవితా మా తపః కృథాః

       తతః ప్రదక్షిణీ కృత్య దేవాః విప్రాః గిరే: సుతాం

 

భావము: నా తపస్సు వృథా కాకుండా శివుడే భర్త కాగలడని నిశ్చయించుకుని తల్లిదండ్రులకు, దేవతలకు, బ్రాహ్మణులకు ప్రదక్షణము చేసి పార్వతి దండకారుణ్యమునకు బయలుదేరెను.

 

పార్వతి తపస్సు చేయచుండగా శివుడు :-

 

శ్లో॥ వికృతం రూపమాస్థాయ హ్రస్వో బాహుక ఏవచ

       విభగ్న నాసికో భూత్వా కుబ్జః కేశాన్త పింగళః

భావము: వికృతరూపము, పొట్టి చేతులు, బాహువులు, భిన్నమైన నాసిక, పొట్టివాడు, పింగళ వర్ణములు కేశములతో శివుడు పార్వతి ఎదుట నిలబడెను.

 

పార్వతి యోగశక్తి ద్వారా శివుడు వచ్చెనని కనుగొని మానసికపూజ గావించెను. మనస్సుతోనే షోడశోపచారములను గావించెను.

 

శ్లో॥ భగవన్ నస్వతంత్రోహం పితామే త్వగ్రణీ గృహే

        సప్రభుర్మమ దానేవై కన్యాహం ద్విజపుంగవః

భావము: ఓ దేవా! నేను స్వతంత్రురాలుని కాను. తండ్రి అధీనములో ఉన్నదానిని. నీవు నా తండ్రి వద్దకు వెళ్లి నీ కుమార్తె అపర్ణను నాకిచ్చి వివాహము జరిపించమని విన్నవింపుడని అపర్ణ చెప్పెను.

 

ఆ మాటలు విని వికృతాకారముగా హిమవంతుని వద్దకు వెళ్లి అడిగెను.

 

శ్లో॥ తచుఛృ త్వాశైల వచనం భగవాన్ వృషభద్వజః

        దేవ్యాః సమీపమాగత్య ఇదమాహ మహామనాః

 

భావము: మరల ఉమ వద్దకు వచ్చి తన తండ్రి చెప్పిన మాటలను ఈ విధముగా చెప్పెను.

 

శివ ఉవాచ

 

శ్లో॥ దేవి పిత్రా త్వమను జ్ఞాతః స్వయంవర ఇతి శ్రుతః

        తత్రత్వం వరయిత్రీయం సతేభర్తా భవేదితి

 

భావము: నీ తండ్రి స్వయంవరములో అపర్ణ నిన్ను భర్తగా స్వీకరింపగలదని చెప్పెను.

 

శ్లో॥ తేనోక్తా సా తదా తత్ర భావయన్తీ తదీరితం

        భావంచ రుద్ర నిహితం ప్రసాదం మనసస్తదా

 

భావము: శివుని మాటలు విని పార్వతి రుద్రునిపై మనస్సు లగ్నము చేసి మరల తపస్సు ప్రారంభించెను.

అపుడు బ్రహ్మ గారు ప్రత్యక్షమై ఉమతో ఇట్లు పలికెను.

 

శ్లో॥ అథన తేస్తి సందేహో మయి విప్ర కథంచన

        ఇహైవ త్వాం మహాభాగ వరయామి మనోగతం

 

భావము: నాయందు నీకు సందేహము వలదు. ఇచటనే శివుని వరునిగా పొంది నీ కోరిక నెరవేరునని చెప్పెను.

 

శ్లో॥ గృహీత్వా స్తబకం సాతు హస్తాభ్యాం తత్రసంస్థితా

        స్కంధౌ శంభోః సమాధాయ దేవీప్రాహ వృతోసి మే

 

భావము: బ్రహ్మ పార్వతి చేతికి పుష్పమాలను యిచ్చి, శివుడు నిన్ను వరించు సమయమునకై వేచి ఉండమని బ్రహ్మ పలికెను. మరియు

 

శ్లో॥ యస్మాత్తవ సుపుణ్యేన స్తబకేన వృతో స్మ్యహం

        తస్మాత్వం జరయాత్యక్తః

 

భావము: ఈ పుష్పమాల తో శివుని వరింపగలవు. నీకు ముసలితనము ఉండదు. అమరత్వము సంభవింపగలదని వక్కాణించెను.

 

శ్లో॥ కామరూపీ కామపుష్పః కామదో దయతో మామ

        సర్వాభరణ పుష్పాఢ్యః సర్వపుష్ప ఫలో గమః

 

భావము: కోరిన రూపము గలదానా! కోరికతో పూవులను ఆభరణముగా చేసి ధరించితివి. ఆ ఫలితమును నీవు పొందగలవు.

 

శ్లో॥ యశ్చాత్ర నియమైర్యుక్తః ప్రాణానే సమ్యక్ త్యజేత్

        సదేవ్యాస్త పసాయుక్తో మహా గణపతిర్భవేత్

 

భావము: ప్రాణములను లెక్క చేయకుండా నీవు చేయి తపస్సుకు విఘ్నములు కలుగవని చెప్పి బ్రహ్మగారు అంతర్థానమయ్యెను.

 

ఆ తరువాత

 

శ్లో॥ సాపి దేవీగతే తస్మిన్ భగవత్యమితాత్మని

        తతఏవోన్ముఖీ భూత్వా శిలాయాం సంబభూవహ

 

భావము: శివుని కెదురుగా రాతిపై నిలిచి మనస్సు లఘ్నము చేసి తపస్సు చేయిచుండెను.

 

ఆ సమయములో

 

శ్లో॥ అథ శుశ్రావ శబ్దంచ బాలస్త్యార్తస్య శైలజా

        సరస్యుదక సంపూర్ణే సమీపే చాశ్రమస్యచ

 

భావము: ఆశ్రమమునకు దగ్గరలో సరస్సు తీరమున బాలుని యొక్క ఆర్తనాదము వినిపించెను.

 

శ్లో॥ సకృత్వా బాలరూపంతు దేవ దేవః స్వయం శివః

        క్రీడా హేతోః సరో మధ్యే గ్రాహగ్రస్తో భవస్తదా

 

భావము: దేవదేవుడైన శివుడు స్వయముగా బాలుని రూపము ధరించి సరస్సునందు ఆడుచుండగా మొసలి బాలుని యొక్క కాలుని పట్టుకొనెను.

 

శ్లో॥ యోగమాయా సమస్థాయ ప్రపంచోద్భవ కారణా

        తద్రూపం సరసో మధ్యే కృత్వేవం సమభాషత

 

భావము: యోగమాయను కల్పించి ప్రపంచము ఉద్భవించుటకు కారణభూతుడైన శివుడు బాల రూపముతో ఈ క్రింది విధముగా మాట్లాడెను.

 

శ్లో॥ త్రాతుమాం కశ్చిదిత్యాహ గ్రాహేణ హృత చేతసాం

        ధిక్ కష్టం బాల ఏవాహ మప్రాప్తార్థ మనోరథీః

 

భావము: నాకు ఏ కోరిక తీరకుండగనే మొసలి నన్ను తీసుకొనిపొవుచున్నది. నేను బాలుడను. ఈ మొసలి బారినుండి రక్షింపుడని ఆర్తనాదము చేసెను.

 

శ్లో॥ ప్రయామి నిథనం వక్త్రే గ్రాహస్యాస్య దురాత్మనః

        శోచామి నీస్వకం దేహం గ్రాహగ్రస్తః సుదుఃఖితః

 

భావము: మొసలి పట్టుకొనుటచే నా ముఖము పాలిపోయినది. నా ప్రాణములు ఈ మొసలి చేతిలోనే అంతమగునని దుఃఖించుచుండెను.

 

శ్లో॥ యథా శోచామి పితరం మాతరం చ తపస్వినీం

        గ్రాహ గృహీతం మాం శృత్వాప్రాప్తం నిధనముత్సుకౌ

 

భావము: తపస్సు చేయిచున్న పార్వతిని చూచి ఓ దేవీ! నీవే నా తల్లివి. తండ్రివి. మొసలి పట్టుకుని నన్ను చంప ప్రయత్నిస్తున్నదని అఱచుచున్ననూ నీకు వినబడలేదా!

 

శ్లో॥ ప్రియ పుత్రా వేక పుత్రౌ ప్రాణాత్ న్యూనం త్యజిష్యతః

        అహోబత సుకష్టంవై యోహం బాలోకృతాశ్రమః

 

భావము: నా తల్లిదండ్రులకు ఏకైక పుత్రుడను. ప్రియమైనవాడిని. నేను ప్రాణములు విడిచినచో నా తల్లిదండ్రులు ఎంతగా దుఃఖింతురో గదా!

 

శ్లో॥ శృత్వాతు దేవీ తం నాదం విప్రస్యార్తస్య శోభనా

        ఉత్థాయ ప్రస్థితా తత్రయత్ర తిష్ఠత్యసౌ ద్విజః

 

భావము: పార్వతి ఆ బాలుని యొక్క ఆర్తనాదమును విని సరస్తీరమున ఉన్న బాలుని చూచెను.

ఆ బాలుడు ముగ్ధ మనోహరాకృతి కలిగి యుండెను. భయపడుచున్న బాలుని చూచి సరోవరములోనికి దిగెను.

 

శ్లో॥ గ్రాహరాజ మహాసత్వ బాలకంహి ఏకపుత్త్రకం

        విముంచేమం మహాదంష్ట్ర క్షిప్రం భీమ పరాక్రమ

 

భావము: ఓ మొసలీ! ఈ బాలుడు అతని తల్లిదండ్రులకు ఏకైకపుత్రుడు కావున వెంటనే విడిచిపెట్టుమని పార్వతి అడిగెను.

 

గ్రాహ ఉవాచ:

 

శ్లో॥ యో దేవీ దివసే షష్ఠౌ ప్రథమం సముపైతి మాం

        స ఆహారో మమ పురావిహితో లోక కర్తృభిః

 

భావము: ఓ దేవీ! బ్రహ్మ నాకు మధ్యాహ్న భోజనముగా ఈ బాలుని స్వీకరింపుమని చెప్పెను, నీ తపస్సును ధారపోసినచో విడిచెదనని మొసలి చెప్పెను.

 

దేవ్యువాచ:

 

శ్లో॥ యన్మయా హిమవచ్ఛృంగే చరితంతప ఉత్తమం

        తేన బాలమిమంముంచ గ్రాహరాజ నమోస్తుతే

 

భావము: మొసలికి నమస్కారము చేయుచూ పార్వతి నా తపస్సును నీకు ధారపోసెదను ఈ బాలుని విడిచి పెట్టెదవా అని అడిగెను.

 

నీ తపస్సును దానము చేసిన విడిచెదనని మరల మొసలి పార్వతితో చెప్పెను.

 

  దేవ్యువాచ:

 

శ్లో॥ జన్మ ప్రభృతి యత్పుణ్యం మహాగ్రాహ కృతం మయా

        తత్తేసర్వం మయా దత్తం బాలంముంచ మహాగ్రాహ

 

భావము: జన్మ మొదలకుని ఇప్పటివరకు సంపాదించిన పుణ్యము నీకు ధారపోసెదను. బాలుని విడిచిపెట్టుమని మొసలిని ఆతృతతో పార్వతి అడిగెను.

 

వెంటనే మొసలి యొక్క ముఖము మధ్యాహ్న సూర్యుని వలే ప్రకాశించెను. ఓ దేవీ! నీవు బాగుగా ఆలోచించి చెప్పుచుంటివి గదా! మరల పుణ్యము సంపాదించుట కష్టమే కదా! అని మొసలి పార్వతిని అడిగెను. బ్రాహ్మణ బాలుని కొఱకు నీ తపస్సు ధార పోయుచుంటివి. నీకేమైనా వరము కావలెనో కోరుకొమ్మని అడిగెను.

 

అపుడు పార్వతి నేను మరల తపస్సు చేసి పుణ్యము సంపాదించగలను. అందువలన నాకేమీ కోరిక లేదని చెప్పెను.

 

శ్లో॥ దత్తమే తన్మయా తుభ్యం నాదదానిహి తత్పునః

        త్వయ్వే వరమ తామేతత్ బాలశ్చాయం విముచ్యతాం

 

భావము: నాచే ఈయబడిన ఈ దానము తిరిగి తీసుకొనబడదు. నీవే అనుభవించు. బాలుని విడిచిపెట్టుమని పార్వతి అడిగెను.

 

శ్లో॥ తధోక్తోస్తాం ప్రశస్యాథ ముక్త్వా బాలం నమస్యత

        దేవీమాదిత్యావభాసః తత్రైవాన్త రధీయత

 

భావము: ఉమాదేవి అడిగిన విధముగా బాలుని విడిచిపెట్టి మొసలి అంతర్థానమమయ్యెను.

 

శ్లో॥ బాలోపి సరసస్తీరే ముక్తో గ్రాహేణ వైతదా

        స్వప్న లబ్ధ ఇవార్ధౌఘః తత్రైవాన్త రధీయత

 

భావము: మొసలి చేత విడిపింపబడిన బాలుడు కలలో చూచుచున్నట్లుగా బాలుడు కూడా అంతర్థానమమయ్యెను.

 

మరల పార్వతి తపస్సు చేసుకొనుటకై సన్నద్ధమగుచుండెను.

 

శ్లో॥ కర్తుకామాం తపో భూయో జ్ఞాత్వాత్వాం శంకరః స్వయం

        ప్రోవాచవచనం విప్రాః మాకృథాః తప ఇత్యుత

 

భావము: మరల తపస్సు చేయిటకై వెళ్ళుచున్న పార్వతిని చూచి శంకరుడు తపస్సు చేయవద్దని వారించెను.

 

శ్లో॥ మహ్యమే తత్తపోదేవి త్వయాదత్తం మహావ్రతే

        తత్తేనైవాక్షయం తుభ్యం భవిష్యతి సహస్రధా

 

భావము: నీచే ఈయబడిన ఈ తపోదానము వలన నీ తపస్సు అక్షయమగును. భవిష్యత్తులో అనేక విధములుగా ఈ తపోదానము ఉపయోగపడునని శంకరుడు పలికెను.

 

శ్లో॥ ఇతిలబ్ధ్వా వరందేవీ తపస్యో క్షయముత్తమం

        స్వయంవరము దీక్షన్తీ తస్ధౌ ప్రీతాముదాయితా

 

భావము: నీయొక్క తపఃఫలము అక్షయమగునని శివుని వద్ద వరము పొంది పార్వతి స్వయంవరమునకు సంతోషముగా బయలుదేరెను.

 

శ్లో॥ ఇదం పఠేభ్యోహి నరః సదైవ బాలానుభావం

        సదేహ భేదం సమవాప్యపూతో భవేత్ గణేశస్తు కుమారతుల్యః

 

భావము: ఈ కథను ఎవరైతే పఠిన్తురో వారికి వెంటనే వివాహము కాగలదు. ఆ తర్వాత గణేశుడు, కుమారస్వామి వంటి పుత్రులు కలిగెదరని శిలా రూపమున ఉన్న పార్వతిని పూజించిన వారికి సమస్త కోరికలు తీరునని చెప్పి శివ పార్వతులిద్దరూ అంతర్థానమయ్యెను.త్రియోగి నారయణ్ లో శివ పార్వతుల కళ్యాణం జరిగిన పూజనీయమైన, దర్శింప వలసిన ప్రదేశం


 

శుభంభూయాత్

 

ఇతి బ్రహ్మే మహా పురాణే స్వయంభూ ఋషి సంవాదే పార్వత్యాః సత్వ దర్శనం నామ పంచత్రింశోధ్యాయః