Telugu_MainPage
Aparna Devi Vratam, Mata Aparna Vrata, Aparna Amma Vratakalpam, Sreem Aparna Vratah, Sreem Aparna, Aparna Devi, శ్రీ అపర్ణా వ్రతకల్పము

శ్రీరస్తు || శుభమస్తు || అవిఘ్నమస్తు

ఓం శ్రీ అపర్ణాదేవ్యై నమః

శ్రీ అపర్ణా వ్రతకల్పము 


శ్రీ అపర్ణాదేవి అమ్మవారి వ్రతమును ఈ క్రింది కారణాల కోసం ఆలయములో కాని, ఇంటి వద్ద కాని చేసుకొనవచ్చును

 

1. కుటుంబ సౌఖ్యము కొరకు (శుక్రవారం ఉ.10.30 గం. నుండి 12.00 గం. రాహుకాలమందు)

2. కుజగ్రహదోష నివృత్తికి, వివాహాలు కుదురుటకు (మంగళవారములయందు)

3. రాహు, కేతు గ్రహదోష నివృత్తికి (శుక్రవారం ఉ.10.30 గం. నుండి 12.00 గం. రాహుకాలమందు లేదా మంగళవారములయందు)

4. ఋణ బాధలు తొలగుటకు (మంగళవారములయందు)

5. ఉద్యోగం పొందుటకు, పదోన్నతులు, బదిలీలకు (అష్టమితో కూడిన మంగళవారమందు లేదా మంగళవారములయందు)

6. దాంపత్య సమస్యల నివృత్తికి, సంతానం కొరకు (శుక్రవారములయందు)

7. వ్యాపార వాణిజ్య విషయాలలో చిక్కులు తొలగి ఐశ్వర్యాభివృద్ధికి (శుక్రవారములయందు)

8. ఏ రంగం నందైనను విజయం సాధించడానికి (మంగళవారములయందు)

9. జ్ఞానసముపార్జనకు, తద్వారా మోక్షసాధనకు (శుక్రవారములయందు)

 

ఈ వ్రతమును ఏ మంగళ, శుక్రవారముల నందైనను జరుపుకొనవచ్చును. అష్టమి, చతుర్ధశితో కూడిన మంగళ, శుక్రవారములయందు చేసుకున్నచో విశేష ఫలప్రదము. మీ మీ సౌలభ్యములను బట్టి అమ్మ వారి దివ్యక్షేత్రము నందు ఈ పూజను జరిపించుకొనవచ్చును. మీ సమస్యను బట్టి ఏడు మంగళవారములు కాని, ఏడు శుక్రవారములు కాని ఈ వ్రతమును జరుపుకొనడము మంచిదిగా దైవజ్ఞులు నిర్ణయించారు. మీ ఇంటి దగ్గర అమ్మ వారి పూజను, దివ్యవ్రతమును జరుపుకొనవచ్చును, లేదా జరిపించుకొనవచ్చును. ప్రతీ మంగళవారము ఉదయం 6 గం. నుండి 12 గం. వరకు కుజగ్రహ దోష నివృత్తికి, వివాహాలు కుదరడానికి, మిగిలిన సమస్యలు నివారణకు అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు, ప్రతీ శుక్రవారము ఉదయం 6 గం. నుండి 10.30 గం. వరకు కుంకుమార్చనలు, 10.30 గం. నుండి 12 గం. ల మధ్య రాహుకాలమందు అమ్మవారికి విశేష కుంకుమార్చనలు జరుగును. ప్రతీ పౌర్ణమికి అమ్మవారికి పంచామృత అభిషేకములు, విశేష కుంకుమార్చనలు జరుగును. ప్రతీ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు అమ్మవారికి నవరాత్రి మహోత్సవములు, కుంకుమార్చనలు జరుగును. ఫాల్గుణ శుద్ద సప్తమీనాడు శ్రీ అపర్ణా సమేత నాగేశ్వర స్వామి వారి కల్యాణం మరియు ఊరెరిగింపు జరుగును.

 

కుంకుమ పూజకు, వ్రతమునకు కావలసిన సామాగ్రి:

 

పసుపు - 50 గ్రా. 

కుంకుమ - 200 గ్రా. 

తమలపాకులు - 9 

పోక చెక్కలు - 5

అరటి పండ్లు - 6

కొబ్బరి కాయలు - 2

ఎర్ర పూవులు

ఎర్ర వత్తులు, నెయ్య  

హారతి కర్పూరం - 1/4 తులం 
ఎర్ర జాకట్టు ముక్క -1
తువ్వాలు - 1
కలశకు చెంబు - 1
చిల్లర కాసులు - 9
దీపం కుంది, గంధం, అక్షతలు
పంచపాత్ర, ఉద్దరిణి, అరివేణం
సాంబ్రాణి, ధూప్ స్టిక్
అగరవత్తులు - చిన్నకట్ట 
మామిడి కొమ్మలు - 3
బియ్యం - 1 కేజీ (వినాయక పూజకు)
క్షీరాన్నము (పరమాన్నము) లేక చలిమిడి, వడపప్పు, పానకం

 


గణపతి పూజ

 (దీపారాధన చేసి కుందికి కుంకుమ అలంకరించి నమస్కరించవలెను)

సంకల్పము

 

ఓం కేశవాయ స్వాహా

ఓం నారాయణాయ స్వాహా

ఓం మాధవాయ స్వాహా

(అనుచు మూడుసార్లు కుడిచేతితో నీరు పుచ్చుకొనవలెను)

 

 

ఓం గోవిందాయ నమః

ఓం వాసుదేవాయ నమః 

ఓం విష్ణువే నమః 

ఓం ప్రద్యుమ్నాయ నమః 

ఓం మధుసూదనాయ నమః 

ఓం అనిరుద్ధాయ నమః 

ఓం త్రివిక్రమాయ నమః 

ఓం పురుషోత్తమాయ నమః 

ఓం వామనాయ నమః 

ఓం అధోక్షజాయ నమః 

ఓం శ్రీధరాయ నమః 

ఓం నారసింహాయ నమః 

ఓం హృషీకేశాయ నమః 

ఓం అచ్యుతాయ నమః 

ఓం పద్మనాభాయ నమః 

ఓం జనార్ధనాయ నమః 

ఓం దామోదరాయ నమః 

ఓం ఉపేంద్రాయ నమః 

ఓం సంకర్షణాయ నమః 

ఓం హరయే నమః 

 

ఓం శ్రీకృష్ణాయ నమః 

 

 

ఉత్తిష్టంతు  భూతపిశాచా: ఏతే భూమిభారకా: ।

ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ।।

(అక్షతలు వాసన చూచి వెనుకకు వేసుకోవలెను)

 

అంగుళ్యగ్రై: నాసికాగ్రం సంపీడ్య పాపనాశనమ్ ।

ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషిభి: పరికల్పితమ్ ॥

(కుడిచేతి బొటన, మధ్య, అనామిక వ్రేళ్ళతో ముక్కు పట్టుకుని శ్వాసపీల్చి కొంచెంసేపు నిలిపి వదలవలెను)

 

మమ ఉపాత్త సమస్తదురితయక్షయ ద్వారా శ్రీ అపర్ణాదేవి ముద్దిశ్య శ్రీ అపర్ణాదేవి ప్రీత్యర్ధం, శుభేశోభన ముహూర్తే శ్రీమహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణ: ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రధమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ... సంవత్సరే ... అయనే ... ఋతౌ ... మాసే .... పక్షే ... తిధౌ... వాసరే (జరుగుచున్న సంవత్సరం, ఆయనము, ఋతువు, మాసము, పక్షము, తిధి, వారము చెప్పవలెను) శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిధౌ శ్రీమాన్ ... గోత్ర: ... నామధేయ: * శ్రీమత: ... గోత్రస్య ... నామధేయస్య * (వివాహము అయినవారు * ధర్మపత్నీసమేతస్య అని చెప్పుకోవలెను) మమోపాత్త దురితక్షయ ద్వారా అపర్ణాదేవి ప్రీత్యర్ధమ్ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్ధం సిద్ధ్యర్ధం ........ సిద్ధ్యర్ధం అపర్ణా పరదేవతా ముద్దిశ్య అపర్ణా పరదేవతా ప్రీత్యర్ధమ్ కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది ఏకవింశతి ఉపచార పూజాం కరిష్యే ॥ అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం సిద్దివినాయక పూజాం కరిష్యే ॥

(అనుకుంటూ అక్షితలు, నీళ్ళు వదిలిపెట్టవలెను)

 

కార్యసిద్ధికై సంకల్పములు:

 

1. వివాహము కొఱకు: జాతకలగ్నవశాత్తు, గోచారలగ్నవశాత్తు ద్వితీయ, చతుర్ధ, సప్తమ, అష్టమ వ్యవస్థాన స్థిత కుజదోష నివృత్తం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్ధం

  

2. ధనప్రాప్తికి: ద్వితీయస్థానస్థిత  కుజదోష నివృత్తి ద్వారా సమస్త సంపత్ సమృద్ధ్యర్ధం

 

3. విద్యా, భూ, గృహఆటంకములు తొలగుటకు: చతుర్ధస్థాన స్థిత కుజదోష నివృత్తి ద్వారా భూ, గృహ, విద్యాభివృద్ధ్యర్ధం 

 

4. సంతానం కొరకు: పంచమస్థాన కుజవీక్షణ దోష నివృత్యర్ధం పంచమాధిపతే: కుజసంయోగజనిత దోష నివృత్యర్ధం పంచమ కారక గురో: సంయోగ వీక్షణ జనిత దోష నివృత్యర్ధం ఆయుష్మత్ సుగుణానేక సుజీవ, సుపుత్ర ప్రాప్యర్ధం.

 

5. శత్రు, రోగ, ఋణ బాధానివృత్తికి: షష్ఠస్థాన స్థిత కుజదోష నివృత్తి ద్వారా శత్రురోగ ఋణబాధాది దోష నివృత్యర్ధం. 

 

6. నష్టద్రవ్యప్రాప్తికి, అపమృత్యుపరిహారము కొరకు: వ్యవస్థాన స్థిత కుజదోషనివృత్తి ద్వారా అపమృత్యు పరిహారద్వారా ఆయుష్యాభి  వృద్ధ్యర్ధం  నష్ట  ద్రవ్యప్రాప్త్యర్ధం 

 

7. కోర్టు, తదితర కేసులనివారణ కొరకు: న్యాయస్థాన స్థిత వివాద విజయ సిద్ధ్యర్ధం. 

 

(సంకల్పం అయిన పిదప పసుపుతో వినాయకుని చేసి తమలపాకు మీద పెట్టి మండపమందు ఉంచవలెను)

 

1. ధ్యానమ్:      వినాయకం హేమవర్ణం పాశాంకుశ ధరం విభుమ్। 

ధ్యాయేద్గజాననం దేవం బాలచంద్ర సమప్రభమ్॥

శ్రీ సిద్ధివినాయక స్వామినేనమః ధ్యాయామి

 

2. ఆవాహనం:   సింధూరారుణ కుంభంచ కుంకుమాజ్కితమాలినమ్। 

సర్వవిఘ్నక్షయకరం సిద్ధిదం సర్వకామదమ్॥ 

శ్రీ సిద్ధివినాయక స్వామినేనమః ఆవాహయామి 

 

3. ఆసనం:        చతుర్భుజం మహాకాయం పూర్ణచంద్ర సమప్రభమ్। 

ఏకదంతం శూర్పకర్ణం పూర్ణమోదక ధారణమ్॥ 

శ్రీ సిద్ధివినాయక స్వామినేనమః ఆసనం సమర్పయామి 

 

4. పాద్యం:         ఇంద్రాది వందితం దేవం సిద్ధగంధర్వ సేవితమ్। 

పాద్యం గృహాణదేవేశ వినాయక నమోస్తుతే॥ 

శ్రీ సిద్ధివినాయక స్వామినేనమః పాద్యం సమర్పయామి 

 

5. ఆర్ఘ్యం:          గజానన మహాకాయ నాగాయజ్ఞోపవీతినే। 

సూర్యకోటి ప్రతీకాశ గృహాణార్ఘ్యం నమోస్తుతే॥ 

శ్రీ సిద్ధివినాయక స్వామినేనమః ఆర్ఘ్యం సమర్పయామి

 

6. ఆచమనీయం: దేవదేవ నమస్తుభ్యం నిర్విఘ్నగణనాయక। 

గంగోదకం మయానీతమిదమాచమనం కురు॥ 

శ్రీ సిద్ధివినాయక స్వామినేనమః ఆచమనీయం సమర్పయామి

 

7. స్నానం:        పయోదధిఘృతం గవ్యం శర్కరామధుసంయుతమ్। 

పంచామృతం మయానీతం స్నానం కురు విధానతమ్।। 

శ్రీ సిద్ధివినాయక స్వామినేనమః పంచామృతస్నానం సమర్పయామి 

స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి 

 

8. వస్త్రం:           రక్తవర్ణం వస్త్రయుగ్మందేవానాంచ సుమంగళమ్। 

గృహాణైశ్వర్య సర్వజ్ఞ లంబోదర శివాత్మజ॥ 

శ్రీ సిద్ధివినాయక స్వామినేనమః వస్త్రం సమర్పయామి

 

9. యజ్ఞోపవీతం: ధారణార్ధం బ్రహ్మసూత్రం సౌవర్ణం చోత్తరీయకమ్। 

వక్రతుండ గృహాణేదం భక్తానాం వరదాయక॥ 

శ్రీ సిద్ధివినాయక స్వామినేనమః యజ్ఞోపవీతం సమర్పయామి

 

10. ఆభరణం:    సువర్ణేనకృతం హారం మౌక్తికైశ్చ సుశోభితమ్। 

భక్త్యా సమర్పితం తుభ్యం భూషణం ప్రతిగృహ్యతామ్॥ 

శ్రీ సిద్ధివినాయక స్వామినేనమః ఆభరణం సమర్పయామి

 

11. గంధం:        గృహాణ దేవదేవేశ దివ్య చందన మిశ్రితమ్ ।

కర్పూర కుంకుమాయుక్తముమాపుత్ర నమోస్తుతే ॥

శ్రీ సిద్ధివినాయక స్వామినేనమః గంధం సమర్పయామి

 

12. అక్షతలు:     శాలియాన్ శ్వేతవర్ణాభాన్ రక్తచందన మిశ్రితాన్ ।

అక్షతాంశ్చ మయాదత్తాన్ గృహాణ సురవల్లభ ॥

శ్రీ సిద్ధివినాయక స్వామినేనమః అక్షతాన్ సమర్పయామి

 

13. పుష్పం:      కమలోత్పల కల్హార పున్నాగ బృహతీనిచ ।

నానావిధాని దివ్యాని పుష్పాణి ప్రతిగృహ్యతామ్ ॥

శ్రీ సిద్ధివినాయక స్వామినేనమః పుష్పై: పూజయామి

 

సుముఖాయనమః

ఏకదంతాయనమః 

కపిలాయనమః 

గజకర్ణికాయనమః 

లంబోదరాయనమః 

వికటాయనమః 

విఘ్నరాజాయనమః 

గణాధిపాయనమః 

ధూమకేతవేనమః 

గణాధ్యక్షాయనమః 

ఫాలచంద్రాయనమః 

గజాననాయనమః 

వక్రతుండాయనమః 

శూర్పకర్ణాయనమః 

హేరంభాయనమః 

స్కందపూర్వజాయనమః 

సర్వసిద్ధిప్రదాయకాయనమః 

శ్రీ మహాగణాధిపతయేనమః 

 

పుష్పాణి పూజాం సమర్పయామి  

 

14. ధూపం:      దశాంగం గుగ్గులం  దివ్యముత్తమం గణనాయక । 

               ధూపం గృహాణదేవేశ గౌరీ పుత్ర నమోస్తుతే ।। 

శ్రీ సిద్ధివినాయక స్వామినేనమః ధూపమాఘ్రాపయామి 

 

15. దీపం:         సర్వజ్ఞ సర్వదేవేశ సర్వసిద్దిప్రదాయక । 

గృహాణ మంగళం దీపం రుద్రపుత్ర నమోస్తుతే ।। 

శ్రీ సిద్ధివినాయక స్వామినేనమః దీపం దర్శయామి 

ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి 

 

16. నైవేద్యం:     మోదకా, లడ్డుకా, పూపాన్, నారికేళ, ఫలానిచ । 

సద్ఘృతం పరమాన్నంచ,  నైవేద్యం ప్రతిగృహ్యతామ్ ।। 

శ్రీ సిద్ధివినాయక స్వామినేనమః నైవేద్యం సమర్పయామి 

 

17. పునరాచమనం: కర్పూరమిశ్రితం తోయం కస్తూర్యాది సమన్వితమ్ । 

గృహాణ విఘ్నరాజేంద్ర సర్వసంపత్కరం శుభమ్ ।। 

శ్రీ సిద్ధివినాయక స్వామినేనమః పునరాచమనీయం సమర్పయామి 

 

18. తాంబూలం: నాగవల్లీ దళైర్యుక్తమేకవింశతి సంఖ్యయా ।

క్రముకం చూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ।। 

శ్రీ సిద్ధివినాయక స్వామినేనమః తాంబూలం సమర్పయామి 

 

19. మంత్రపుష్పం: సౌవర్ణం రాజితంచైవ నిక్షిప్తంచ తవాగ్రతః । 

సువర్ణపుష్పం దేవేశ సర్వవిఘ్నహరోభవ ।। 

శ్రీ సిద్ధివినాయక స్వామినేనమః మంత్రపుష్పం సమర్పయామి 

 

20. ప్రదక్షిణం:    నమస్తే దేవదేవేశ భక్తానా మభయప్రద । 

విఘ్నం నాశయకామేశ హరాత్మజ నమోస్తుతే ।। 

ప్రదక్షిణ త్రయదేవ ప్రయత్నేన మయాకృతమ్ । 

దాసోయమితిమాం రక్ష నమస్తే భక్తవత్సల ।। 

శ్రీ సిద్ధివినాయక స్వామినేనమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి 

 

21. ప్రార్ధన నమస్కారం: ఆయుర్దేహి యశోదేహి శ్రియం దేహీచ సౌఖ్యకమ్ ।

పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ దేహిమే గణనాయక ।। 

శ్రీ సిద్ధివినాయక స్వామినేనమః ప్రార్ధన నమస్కారం సమర్పయామి 

అనేన ఏకవింశత్యుపచార పూజనేన భగవాన్ సర్వాత్మకః ఏతత్ఫలం 

శ్రీ సిద్ధివినాయకార్పితమస్తు । శ్రీ సిద్ధివినాయక ప్రసాదం శిరసాగృహ్ణామి ।। 

 

 

శ్రీ అపర్ణాదేవి పూజావిధానముపునరాచమ్య ॥ 

 

1. ఓం కేశవాయస్వాహా 

2. ఓం నారాయణాయస్వాహా (ఉదకము చేతిలో పోసుకుని పుచ్చుకోవలెను)

3. ఓం మాధవాయస్వాహా 

 

ఓం గోవిందాయ నమః

ఓం వాసుదేవాయ నమః 

ఓం విష్ణువే నమః 

ఓం ప్రద్యుమ్నాయ నమః 

ఓం మధుసూదనాయ నమః 

ఓం అనిరుద్ధాయ నమః 

ఓం త్రివిక్రమాయ నమః 

ఓం పురుషోత్తమాయ నమః 

ఓం వామనాయ నమః 

ఓం అధోక్షజాయ నమః 

ఓం శ్రీధరాయ నమః 

ఓం నారసింహాయ నమః 

ఓం హృషీకేశాయ నమః 

ఓం అచ్యుతాయ నమః 

ఓం పద్మనాభాయ నమః 

ఓం జనార్ధనాయ నమః 

ఓం దామోదరాయ నమః 

ఓం ఉపేంద్రాయ నమః 

ఓం సంకర్షణాయ నమః 

ఓం హరయే నమః 

 

ఓం శ్రీకృష్ణాయ నమః 

ఉత్తిష్ఠoతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః 
ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ।। 
 
 
ప్రాణాయామము
 
అంగుళ్యాగ్రై: నాసికాగ్రం సంపీడ్యపాపనాశనమ్ ।
ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషిభి: పరికల్పితమ్ ।। 
 
(కుడిచేతి బొటన, మధ్య, అనామిక వ్రేళ్ళతో ముక్కు పట్టుకుని శ్వాసపీల్చి కొంచెంసేపు నిలిపి వదలవలెను)
 
 
సంకల్పము 
 
మామ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీఅపర్ణాదేవతా ప్రీత్యర్ధం పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిధౌ శ్రీమతః...... గోత్రస్య...... నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య, సహకుటుంబస్య, క్షేమ, స్ధైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్ధం, ధర్మార్ధకామమోక్ష చతుర్విధ పురుషార్ధ ఫల సిద్ధ్యర్ధం, అపర్ణాదేవీ ముద్దిశ్య, శ్రీఅపర్ణాదేవీ ప్రీత్యర్ధం, కల్పోక్త ప్రకారేణ ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ।।
 

                          ధ్యానము

 

ఏకపాదస్ధితాం దేవీం చిన్మయానంద విగ్రహమ్ ।

చీరవల్కల సంవీతాం జటసంఘాత ధారిణీమ్ ।

శివచింతన సంసక్తాం తపసా ద్యోతిత ప్రభామ్ ।

అగ్నివర్ణాం మహాదేవీం అపర్ణాం పార్వతీం భజే ।।

 

                    ఆవాహనం

 

శ్లో॥  మాతరం పితరం సాథప్రణిపత్యముదా శివా ।

సఖీభ్యాంచశివాంస్మృత్వా తపస్తప్తుంసముద్గతా ।।

శ్రీ అపర్ణాదేవ్యై నమః ఆవాహయామి

 

                      ఆసనం

 

శ్లో॥  హిత్వా మతాన్యనేకాని వస్త్రాణి వివిధానిచ ।

వల్కలాని ధ్రుతాన్యాశు మౌoజీం బద్ధ్వాతు శోభనామ్  ।।

శ్రీ అపర్ణాదేవ్యై నమః దివ్య సింహాసనం సమర్పయామి

 

                     పాద్యం

 

శ్లో॥ హిత్వాహారం తథాచర్మ మృగస్య పరమం ధృతమ్ ।

జగామ తపసే తత్ర గంగావతరణం ప్రతి ।।

శ్రీ అపర్ణాదేవ్యై నమః పాదయో: పాద్యం సమర్పయామి

 

                    అర్ఘ్యమ్

 

శ్లో॥ శంభునా కుర్వతా ధ్యానం యత్రదగ్ధోమనోభవః ।

గంగావతరణోనామ ప్రస్థో హిమవత స్సచ ।।

శ్రీ అపర్ణాదేవ్యై నమః హస్తయో: అర్ఘ్యం సమర్పయామి

 

               ఆచమనీయమ్

 

శ్లో॥ హరశూన్యో థ దదృశే స ప్రస్థో హిమభూభృతః ।

కాల్యాతత్రేత్య భోస్తాత పార్వత్యా జగదంబయా ।।

శ్రీ అపర్ణాదేవ్యై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి

 

             శుద్ధోదక స్నానమ్

 

శ్లో॥ యత్రస్థిత్వాపురా శంభుస్తపవాన్ దుస్తరం తపః ।

తత్రక్షణంతు సాస్థిత్వా బభూవ విరహార్దితా ।।

శ్రీ అపర్ణాదేవ్యై నమః శుద్ధోదకేన సమర్పయామి

 
                  వస్త్రమ్ 
 
శ్లో ॥  హా హరేతి శివాతత్రరుదన్తీ సా గిరేస్సుతా ।
విలలాపాతి దు:ఖార్తా చింతాశోక సమన్వితా ।। 
శ్రీ అపర్ణాదేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి 
 
                  చామరం 
 
శ్లో ॥  తతశ్చిరేణ సామోహం ధైర్యాత్సం స్తభ్య పార్వతీ । 
నియమాయా భవత్తత్ర దీక్షితా హిమవత్సుతా ।। 
శ్రీ అపర్ణాదేవ్యై నమః వ్యజన చామరే వీజయామి 
 
                చందనమ్ 
 
శ్లో ॥ తపశ్చకార సాతత్ర శృంగితీర్ధే మహోత్తమే । 
గౌరీశిఖర నామాసీత్ తతపః కరణాద్ధితత్ ॥ 
శ్రీ అపర్ణాదేవ్యై నమః శ్రీగంధాన్ ధారయామి 
 
                ఆభరణాని 
 
శ్లో ॥ సుందరాశ్చ ద్రుమాస్తత్ర పవిత్రాశ్శివయామునే । 
ఆరోపితాః పరీక్షార్ధం తపసః ఫల భాగినః ॥ 
శ్రీ అపర్ణాదేవ్యై నమః సర్వాభరణాని సమర్పయామి 
 
                పుష్పాణి 
 
శ్లో ॥ భూమిశుద్ధిం తతః కృత్వా వేదీం నిర్మాయ సుందరీ ।
తథాతపస్సమారబ్ధం మునీనామపి దుష్కరమ్ ॥ 
శ్రీ అపర్ణాదేవ్యై నమః పుష్పం సమర్పయామి
 
            అథఅంగపూజా 
 
ఓం శ్రీం అపర్ణాయై నమః పాదౌ పూజయామి
ఓం శ్రీం చపలాయై నమః గుల్ఫౌ పూజయామి
ఓం శ్రీం కాంత్యై నమః జంఘే పూజయామి
ఓం శ్రీం భద్రకాళ్యై నమః ఊరూ పూజయామి
ఓం శ్రీం కమిలిన్యై నమః కటిం పూజయామి
ఓం శ్రీం శివాయై నమః నాభిం పూజయామి
ఓం శ్రీం క్షమాయై నమః ఉదరం పూజయామి
ఓం శ్రీం గౌర్యై నమః హృదయం పూజయామి
ఓం శ్రీం కంబు కంఠ్యై నమః కంఠo పూజయామి
ఓం శ్రీం తాళ్ళపురి నివాసిన్యై నమః ముఖం పూజయామి
ఓం శ్రీం స్వర్ణకుండలాయై నమః కర్ణౌ పూజయామి
ఓం శ్రీం సుస్వరూపాయై నమః నాశికాం పూజయామి
ఓం శ్రీం కుమార్యై నమః శిరః పూజయామి
ఓం శ్రీం యోగనిద్రాయై నమః శ్రీపాదుకే పూజయామి
ఓం శ్రీం శ్రీఅపర్ణాదేవ్యై నమః సర్వాంగాణాo పూజయామి 

 

  1. ఓం శ్రీం అపర్ణాయై నమః

55. ఓం శ్రీం మనోగమ్యాయై నమః

  2. ఓం శ్రీం అంబికాయై నమః

56. ఓం శ్రీం మహావేగాయై నమః

  3. ఓం శ్రీం అక్షమాలాధరాయై నమః

57. ఓం శ్రీం మంగళప్రదాయై నమః

  4. ఓం శ్రీం అనంతాయై నమః

58. ఓం శ్రీం మంత్రవిద్యాయై నమః 

  5. ఓం శ్రీం అరుణాయై నమః

59. ఓం శ్రీం మహావిద్యాయై నమః  

  6. ఓం శ్రీం ఆదిశక్త్యై  నమః

60. ఓం శ్రీం మేనకాత్మజాయై నమః 

  7. ఓం శ్రీం ఆర్యాయై నమః

61. ఓం శ్రీం మాతృశాప వినాశిన్యై నమః  

  8. ఓం శ్రీం ఆనందపూరితాయై నమః

62. ఓం శ్రీం యోగాయై నమః

  9. ఓం శ్రీం ఇష్టార్ధదాయై నమః

63. ఓం శ్రీం రూపసౌభాగ్యదాయిన్యై నమః 

10. ఓం శ్రీం ఈశ్వర్యై నమః

64. ఓం శ్రీం రుద్రాణ్యై నమః 

11. ఓం శ్రీం ఉమాయై నమః

65. ఓం శ్రీం లక్ష్యార్ధాయై నమః 

12. ఓం శ్రీం ఋణవిమోచన్యై నమః

66. ఓం శ్రీం లఘుసిద్ధిదాయై నమః 

13. ఓం శ్రీం లుప్త పాపాయై నమః

67. ఓం శ్రీం లాస్యప్రియాయై నమః

14. ఓం శ్రీం ఏకపాదస్థితాయై నమః

68. ఓం శ్రీం లావణ్యనిధయే నమః 

15. ఓం శ్రీం ఐశ్వర్యదాయై నమః

69. ఓం శ్రీం వరప్రదాయై నమః 

16. ఓం శ్రీం ఓంకారాయై నమః

70. ఓం శ్రీం వింధ్యాచల నివాసిన్యై నమః 

17. ఓం శ్రీం కౌలిన్యై నమః

71. ఓం శ్రీం విజయాయై నమః 

18. ఓం శ్రీం కళ్యాణదాయై నమః

72. ఓం శ్రీం వాంఛితార్ధప్రదాయిన్యై నమః  

19. ఓం శ్రీం కమలాక్ష్యై నమః

73. ఓం శ్రీం విద్యారూపాయై నమః 

20. ఓం శ్రీం కంబుకంఠ్యై నమః

74. ఓం శ్రీం విశాలనేత్రాయై నమః 

21. ఓం శ్రీం కదంబవనవాసిన్యై నమః

75. ఓం శ్రీం వాగీశ్వర్యై నమః 

22. ఓం శ్రీం కమండలుధరాయై నమః

76. ఓం శ్రీం వాణీరమాసేవితాయై నమః 

23. ఓం శ్రీం కనకవర్ణాయై నమః

77. ఓం శ్రీం వందారుజనవత్సలాయై నమః 

24. ఓం శ్రీం కామరూపాయై నమః

78. ఓం శ్రీం శర్వాణ్యై నమః  

25. ఓం శ్రీం కాత్యాయన్యై నమః

79. ఓం శ్రీం శరణాగత వత్సలాయై నమః 

26. ఓం శ్రీం కాళ్యై నమః

80. ఓం శ్రీం శతృశాప క్షయకర్యై నమః 

27. ఓం శ్రీం కుజదోషవినాశిన్యై నమః

81. ఓం శ్రీం శీఘ్రసిద్ధిదాయై నమః 

28. ఓం శ్రీం గిరిజాయై నమః

82. ఓం శ్రీం శివాయై నమః 

29. ఓం శ్రీం గుణప్రియాయై నమః

83. ఓం శ్రీం శివధర్మపరాయణాయై నమః 

30. ఓం శ్రీం గౌర్యై నమః

84. ఓం శ్రీం శివధ్యాన పరాయణాయై నమః 

31. ఓం శ్రీం చతుర్భుజాయై నమః

85. ఓం శ్రీం శివ ప్రియాయై నమః 

32. ఓం శ్రీం చంద్రవదనాయై నమః

86. ఓం శ్రీం శీఘ్రగామిన్యై నమః 

33. ఓం శ్రీం చండికాయై నమః

87. ఓం శ్రీం శాంకర్యై నమః 

34. ఓం శ్రీం జటిలాయై నమః

88. ఓం శ్రీం శ్రీమత్యై నమః 

35. ఓం శ్రీం తపోనిష్ఠాయై నమః

89. ఓం శ్రీం శ్రీకర్యై నమః 

36. ఓం శ్రీం తపస్సిద్ధిదాయై నమః

90. ఓం శ్రీం సర్వసంపత్ప్రదాయై నమః 

37. ఓం శ్రీం తాళ్ళపురి నివాసిన్యై నమః

91. ఓం శ్రీం శుభాయై నమః 

38. ఓం శ్రీం దయాశీలాయై నమః

92. ఓం శ్రీం శోకనాశిన్యై నమః

39. ఓం శ్రీం దివ్యాంగాయై నమః

93. ఓం శ్రీం శ్యామాంగాయై నమః  

40. ఓం శ్రీం దుర్గాయై నమః

94. ఓం శ్రీం షడాంగదేవతాయుక్తాయై నమః 

41. ఓం శ్రీం నిరాధారయై నమః

95. ఓం శ్రీం సర్వజ్ఞాయై నమః 

42. ఓం శ్రీం నిర్మలాయై నమః

96. ఓం శ్రీం సర్వశక్త్యై నమః 

43. ఓం శ్రీం నిత్యపూర్ణాయై నమః

97. ఓం శ్రీం సర్వమంగళాయై నమః 

44. ఓం శ్రీం పరాయై నమః

98. ఓం శ్రీం సర్పశాప ప్రమథిన్యై నమః 

45. ఓం శ్రీం పుత్రప్రదాయై నమః

99. ఓం శ్రీం సద్యః ప్రసాదిన్యై నమః 

46. ఓం శ్రీం పద్మిన్యై నమః

100. ఓం శ్రీం సర్వసుఖప్రదాయై నమః 

47. ఓం శ్రీం పార్వత్యై నమః

101. ఓం శ్రీం సర్వసంమోహిన్యై నమః 

48. ఓం శ్రీం పితృశాపనివారిణ్యై నమః

102. ఓం శ్రీం సర్వశాస్త్ర స్వరూపాయై నమః 

49. ఓం శ్రీం పత్నీశాపప్రశమన్యై నమః

103. ఓం శ్రీం సర్వవేద్యాయై నమః 

50. ఓం శ్రీం పుణ్యస్వరూపిణ్యై నమః

104. ఓం శ్రీం సావిత్ర్యై నమః 

51. ఓం శ్రీం భక్తవత్సలాయై నమః

105. ఓం శ్రీం సుభద్రాయై నమః 

52. ఓం శ్రీం భవాన్యై నమః

106. ఓం శ్రీం హైమావత్యై నమః 

53. ఓం శ్రీం భ్రాతృశాపనివారిణ్యై నమః

107. ఓం శ్రీం హరిప్రియాయై నమః 

54. ఓం శ్రీం మంగళాయై నమః

108. ఓం శ్రీం క్షి ప్రప్రసాదిన్యై నమః 

ఓం శ్రీం శ్రీ అపర్ణాపరాభట్టారికాయైనమః కుంకుమ, పుష్పాణి పూజాం సమర్పయామి

 
 
                         ధూపః
 
శ్లో॥ విగృహ్య మనసా సర్వాణీంద్రియాణి సహాశు సా ।
సమప స్థానికే తత్ర చకార పరమం తపః  ॥
శ్రీ అపర్ణాదేవ్యై నమః ధూప మాఘ్రాపయామి ॥
 
                         దీపః
 
శ్లో॥ గ్రీష్మేచ పరితో వహ్నిం ప్రజ్వలంతం దివానిశమ్ ।
కృత్వా తస్థౌచ తన్మధ్యే సతతం జపతీ మనుమ్ ॥
శ్రీ అపర్ణాదేవ్యై నమః దీపం దర్శయామి ॥
 
                     నైవేద్యమ్
 
శ్లో॥ శీతే జలాంతరే శశ్వత్త స్థౌ సా భక్తి తత్పరా ।
అనాహారా త్తప స్తత్ర నీహారేషు నిశాసుచ ॥
శ్రీ అపర్ణాదేవ్యై నమః నైవేద్యం నివేదయామి  ॥
 
                  తాంబూలమ్
 
శ్లో॥ ఏవం తపః ప్రకుర్వాణా పంచాక్షర జపేరతా ।
దధ్యౌ శివం శివా తత్ర సర్వకామ ఫలప్రదమ్ ॥
శ్రీ అపర్ణాదేవ్యై నమః తాంబూలం సమర్పయామి ॥
 
                  నీరాజనమ్
 
శ్లో॥ ప్రధమం ఫలభోగేన ద్వితీయం పర్ణభోజనై ।
తపః ప్రకుర్వతీ దేవీ క్రమాన్నిద్యే మితాస్సమాః  ॥
శ్రీ అపర్ణాదేవ్యై నమః కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి ॥
 
                మంత్రపుష్పమ్
 
(ఇక్కడ అవకాశం గలవారు మంత్రపుష్పము సంపూర్ణముగా చెప్పవచ్చును)
కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి ।
తన్నో దుర్గి: ప్రచోదయాత్ ॥
శ్లో॥ తతః పర్ణాన్యపి శివా నిరస్య హిమవత్సుతా ।
నిరాహారా భవద్దేవి తపశ్చరణ  సంరతా ॥
శ్రీ అపర్ణాదేవ్యై నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి ॥
 
            ఆత్మప్రదక్షిణ నమస్కారః
 
శ్లో॥ ఆహారే త్యక్త పర్ణాభూ ద్యస్మాత్ హిమవతస్సుతా ।
తేనదేవైరపర్ణేతి కథితా నామత శ్శివా ॥
శ్లో॥ యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ ।
తాని తాని ప్రణస్యంతి ప్రదక్షిణ పదే పదే ॥
శ్లో॥ పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవః ।
త్రాహి మాం కృపయాదేవీ శరణాగత వత్సలే ॥
శ్లో॥ అన్యథాశరణం నాస్తి త్వమేవ శరణం మమ ।
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి ॥
శ్రీ అపర్ణాదేవ్యై నమః  ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ॥
 
                    క్షమాప్రార్థన
 
ఓం జ్ఞానినామపి చేతాంసిదేవీ భగవతీ హిసా ।
బలదా కృష్యమోహాయ మహామాయా ప్రయచ్ఛతి ॥          1
 
దుర్గేస్మృతా హరసి భీతి మశేషజంతో: -
స్వస్థై: స్మృతా మతిమతీవశుభాం శుభాం దదాసి ।
దారిద్ర్య దు:ఖభయ హారిణి కా త్వదన్యా -
సర్వోపకారకరణాయ సదార్థ్ర చిత్తా ॥                             2
 
సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్ధసాధికే  ।
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే  ॥                 3
 
శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే  ।
సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే  ॥                4
 
సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే ।
భయేభ్యః త్రాహినో దేవి దుర్గేదేవి నమోస్తుతే  ॥                5
 
రోగానశేషానపహంసి తుష్టా -
రుష్టాతు కామాన్ సకలానభీష్టాన్ ।
త్వామా శ్రితానాం నవిపన్నరాణాం -
త్వామా శ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి ॥                        6
 
సర్వాబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి 
ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశానమ్ ॥             7
 
అనేన కల్పోక్త ప్రకారేణ అపర్ణా పరదేవతా షోడపచార -
పూజనేన భగవతీ సర్వాత్మకా సర్వం శ్రీ అపర్ణా పరదేవతా -
సుప్రీతాః సుప్రసన్నా వరదా భవంతు ।
ఏతత్ ఫలం శ్రీ అపర్ణా పరాదేవ్యార్పితమస్తు ॥ 
(అని అక్షతలు, నీళ్ళు వదలవలెను)
శ్రీ అపర్ణా పరదేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి ॥ 
(అని పుష్పములను శిరస్సున ధరించి కుంకుమను నొసట పెట్టుకొనవలెను)
 
 

ఓం శ్రీ అపర్ణాదేవ్యై నమః

 

అపర్ణా వ్రతము

 

కథా ప్రారంభః

 

పూర్వము శౌనకాది మహర్షులు నైమిశారణ్యంలో సత్రయాగం చేస్తుండగా అక్కడకు సమస్త పురాణములు తెలిసిన సూత మహర్షులవారు వచ్చారు. ఋషులాయనకు ఆతిథ్యమిచ్చి సుఖాసీనుని చేసి "మహర్షీ! నీవు సమస్తము తెలిసినవాడవు. భూలోకములో జనులు కోరిన కోరికలు అన్నియు పొందుటకు సులభమైన వ్రతము ఏదైనా ఉన్నచో మాయందు దయతో వివరించవలసినదని ప్రార్థించగా" సూతమహర్షి ఈ విధముగా చెప్పెను. ఓ ఋషులారా! కలియుగమున వాంఛాసిద్ధి కలిగించుటకు "అపర్ణా వ్రతము" అను వ్రతమొకటి కలదు. ఆ వ్రతమును ఆచరించిన జనులకు కుజదోషము తొలగి కోరిన కోరికలు అన్నియూ నెరవేరును అని సూతమహర్షి చెప్పగా, ఋషులు మరలా ఇలా అడుగుచున్నారు. ఓ మహాత్మా! "అపర్ణా వ్రతమును ఏ విధముగా చేయవలెను, అందుకు విశేషమైనటువంటి పర్వదినములు ఏమైనా కలవా? ఈ వ్రతమునందు ఏ దేవతను పూజింపవలయును? ఏ విధముగా పూజ చేయవలయును? ఈ వ్రతము చేసినా వచ్చు ఫలమేమి?" అని ఋషులు కోరగా సూతమహర్షి ఈ విధముగా చెప్పుచున్నాడు. శ్రీ అపర్ణా వ్రతము చేయు మానవులు ముందుగా విఘ్నేశ్వర పూజను ఆచరించి, మండపమును ఏర్పరిచి, కలశయందు వరుణదేవుని పూజించి, ప్రతిమారూపిణిగా అపర్ణాదేవిని పూజింపవలెను. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు వైదికముగాను, శూద్రులు పురాణోక్తముగాను, ఈ కల్పములో చెప్పబడిన విధముగా పూజించి ప్రత్యేకముగా క్షీరాన్నము నివేదన గావించి, పూజ పూర్తిచేసి శ్రీ అపర్ణా వృత్తాంతము, కుజ జన్మ వృత్తాంతమును పఠింపవలెను. ఈ ప్రకారము చైత్ర మాసములో కాని, శ్రావణ, ఆశ్వీయుజ, కార్తీక, మాఘ మాసములందు గాని, ఈ వ్రతమును ఆచరించవలెను. ముఖ్యముగా ఈ వ్రతమును ఆచరించు భక్తులు ఏ మాసముల యందైనను మంగళ, శుక్రవారముల యందు శ్రీ అపర్ణాదేవిని పూజించుట విశేషము. కుజదోషము ఉన్న వివాహము కాని వారు, సంతానము లేనివారు మంగళవారము పూజించుట విశేషము. మరియు ఋణ, శత్రుబాధల నుండి విముక్తి కొఱకు మంగళవారము పూజింపవలెను.

 

శ్రీ అపర్ణాదేవిని శుక్రవారము పూజించినచో విద్యార్ధులకు విద్యాలాభము, వ్యాపారులకు ధనలాభము, స్త్రీలకు సౌభాగ్య సంపదలను, పురుషులకు సకల కార్యసిద్ధిని చేకూర్చును. ఈ వ్రతమును ఏడు మంగళవారములు గాని, ఏడు శుక్రవారములు గాని పూర్తిచేసి ఏడుగురు ముత్తైదువులకు వస్త్ర, దక్షిణ తాంబూలాదులు, శ్రీ అపర్ణా వ్రతకల్ప పుస్తకముతో వాయనమిచ్చి వారిచే ఆశీర్వచనము పొందవలెను. ముఖ్యముగా ఈ వ్రతము ఆచరించువారు ప్రారంభమునందు గాని, మధ్యలో గాని, చివరివారము నందు గాని, తాళ్లపురం(తాటిపర్తి) లో వేంచేసియున్న అపర్ణాదేవిని సందర్శించి, పూజించుకొనవలెను. ఈ ప్రకారము శ్రద్ధ, భక్తి విశ్వాసములతో ఎవరు ఈ వ్రతమును ఆచరిస్తారో వారికి అపర్ణాదేవి అనుగ్రహముచేత సకల కార్యములు సిద్ధించుటయే గాక, బ్రతికియున్నంత కాలము ధనము, పుత్రపుత్రికలు కలిగి సమస్తమైన ఐశ్వర్యములను అనుభవించి అంత్యమున దేవి సాన్నిధ్యము పొందుదురు. కలియుగమున వాంఛసిద్ధి కలిగించుటకు, కుజదోష నివృత్తికి ఇంతకంటే సులభమైన వ్రతము మరొకటి లేదని సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పెను.

 

అపర్ణా వ్రత కథ ప్రధమాధ్యాయః సమాప్తః

 

 

 

కుజగ్రహ జనన వృత్తాంతము

 

ద్వితీయోధ్యాయ ప్రారంభః

 

సూత మహర్షిని శౌనకాది ఋషులు ఈ విధముగా అడుగుచున్నారు. ఓ మహర్షీ! ఈ లోకంలో కుజదోషం వలన కొంతమంది వివాహం కాకుండా ఉండిపోవుచున్నారు. కొందరు సంతానము లేక మరికొందరు ధనము లేక ఋణములతోను ఇంకొందరు వ్రణములు ; ప్రమాదములు, అగ్ని బాధలు, శత్రు బాధలు పొందుచున్నారు. అసలు కుజుడెవరు? అతని శక్తి సామర్థ్యములు ఎలాంటివి? కుజదోష నివారణోపాయములు ఏమిటి? అని అడుగగా, సూత మహర్షుల వారు ఋషులారా! శ్రద్ధగా వినండి, పై దోషములు గలవారు శ్రీ అపర్ణా వ్రతములను చేసి, కుజ జన్మ వృత్తాంతము, శ్రీ అపర్ణాదేవి కళ్యాణ వృత్తాంతమును ఎవరైతే శ్రద్ధగా, భక్తులతో పారాయణ చేస్తారో వారికి జన్మలగ్నవసాత్తు గాని, గోచారలగ్నవసాత్తు గాని, ద్వితీయ, చతుర్ధ, సప్తమ, అష్టమ వ్యయస్థానములలో కుజుడు ఉండుట వలన కలుగు సమస్త కుజదోషములు తొలగి కోరిన కోరికలు నెరవేరును. ముందుగా కుజ జన్మ వృత్తాంతము చెప్పుచున్నాను. శ్రద్ధగా వినవలెను, అని సూతులవారు ఈవిధంగా ప్రారంభించిరి.

 

శ్రీ మహావిష్ణువు తన నాభికమలము నుండి బ్రహ్మను సృజించాడు. ఆ బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు. వారిలో దక్షప్రజాపతి ఒకడు. దక్షుడు అనగా సమర్ధుడు అని అర్ధము. ఆ దక్షప్రజాపతి తన కుమార్తెలలో ఇరవైఏడు మందిని "అశ్వని" (నక్షత్రములు) మొదలగువారిని చంద్రునకు ఇచ్చి వివాహము చేసినాడు. ఒక కుమార్తెను పరమేశ్వరునకు ఇచ్చాడు. ఆమె దాక్షాయణి, శ్రీమాత. పరమశివుడు ప్రతీరోజు సాయంత్రం నాట్యం చేస్తాడు. అందుకే ఆయనకు నటరాజు అనే పేరు వచ్చింది. ఆ నాట్యం చూడటానికి ముక్కోటి దేవతలు వస్తారు. దక్షుడు కూడా వచ్చేవాడు. దక్షుడు మామగారు ఐనప్పటినుండి శివుడు నాట్యం పూర్తైన తర్వాత ముందుగా దక్షుని సాగనంపి తర్వాత మిగతా దేవతలను సాగానంపేవాడు. ఒకరోజు వీలులేక దేవతలందరినీ సాగనంపి చివరకు దక్షుని సాగనంపాడు. దాంతో కోపం వచ్చిన దక్షుడు ఓ పెద్దయజ్ఞం తలపెట్టి దానికి కుమార్తెను, అల్లుడిని పిలవలేదు. మరీచ్యాది మహర్షులు హితబోధ చేయబోయారు. కానీ దక్షుడు వినలేదు. నారద మహర్షుల ద్వారా యజ్ఞకార్యాన్ని గురించి విన్న దాక్షాయణి పరమశివుని యజ్ఞానికి వెళ్ళడానికి అనుమతి కోరింది. శివుడు పిలవని పేరంటానికి వెళ్ళడం తగదంటూనే అనుమతి ఇచ్చాడు. ఆమెతో పాటు సహాయకారులుగా కొంతమంది ప్రమథగణాన్ని పంపించాడు. దాక్షాయణి యజ్ఞశాలకు చేరింది. దక్షుడు పిలవకపోయినా వచ్చిన కుమార్తెను (దాక్షాయణిని) చూసి దగ్గరకు వచ్చి పరమశివుని నిందించాడు. "అతడు రాకపోతే నష్టం లేదు, నువ్వు వచ్చావు చాలా సంతోషం" అన్నాడు. దాక్షాయణి తండ్రికి, అక్కడ ఉన్న దేవతలందరికి పరమశివుని గొప్పతనం చెప్పి, శివనింద చేసినవాని కుమార్తెగా ఉండకూడదని నిశ్చయించింది. యజ్ఞకుండము దగ్గరకి వెళ్ళి యోగాగ్నిచే దగ్థమైంది. ఆవార్త తెలిసిన శివుడు దక్షయజ్ఞమును ధ్వంసము చేసినాడు. పిమ్మట శివుడు కైలాసమునకు వెళ్ళి సతీవిరహమును పొందుచూ తిరిగి హిమవత్ పర్వతము నందు తపస్సు చేయుచుండెను. అటుల తపస్సు చేయుచుండిన శివుని మూడవ నేత్రమునుండి శ్వేద బిందువులు నేలపై పడి, ఒక శిశువు ఉద్భవించెను. ఆ బాలుడు ఎర్రని కాంతితో దివ్య తేజస్సుతో నాలుగు భుజములతో ప్రకాశిస్తున్నాడు. దిక్కులు ప్రక్కటిల్లేలా ఏడవడం ప్రారంభిచాడు. ఆ ధ్వనికి భూమి, ఆకాశము ఏకమవుతున్నట్లు ఉంది. ఇంతలో భూదేవి స్త్రీ రూప ధారిణి అయి ఆబాలుడిని ఎత్తుకుని స్తన్యమిచ్చినది. శివుడు భూదేవితో నీవు చాలా పుణ్యాత్మురాలవు. నా శ్వేదబిందువు నీపై పడుటచే ఈ బాలుడు ఉద్భవించాడు. నేటి నుండి నీకుమారుడిగా ప్రసిద్ధి చెందుతాడు. ఇతడు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక, తాపత్రయరహితుడై నీ పేరుతో విఖ్యాతి పొందును, అని చెప్పాడు. శివలలాటజలము భూమిపై పడి ఇతడు జన్మించుటచే (కు-భూమి యందు, జ-జన్మించినవాడు) కుజుడు అని ప్రసిద్ధి నామం కలిగెను. భూమి కుమారుడు గాన భౌముడనియు, అగ్ని తేజస్సుచే పుట్టినవాడు (సర్వాంగములను పీడించువాడు) గాన అంగారకుడనియు ప్రసిద్ధి నొందెను. ఇతడు జన్మించిన కొన్ని క్షణములకే యువకుడై కాశీయందు ఉండి చిరకాలము శివుని గురించి తపస్సు చేసి శివానుగ్రహముచే గ్రహత్వమునొంది శుక్రలోకమునకు పైభాగమున ఉండెను. నాటి నుండి ఎవరు ఇతనిని పూజిస్తారో వారికి వెంటనే కుజదోష నివృత్తి, సర్వకామ్యసిద్ధి కలుగును. ఈ కుజ జన్మ వృత్తాంతము పరమ పావనమైనది. అని సూతుడు శౌనకాది మునులకు తెలిపెను.

 

ద్వితీయోధ్యాయః సమాప్తః

 

శ్రీ అపర్ణా కళ్యాణము

 

తృతీయోధ్యాయః ప్రారంభః

 

సూతుడు మరలా ఇలా చెప్పుచున్నాడు. ఓ మునిపుంగవులారా! ముఖ్యమైన అపర్ణా కళ్యాణ వృత్తాంతమును చెప్పుచున్నాను. శ్రద్ధగా వినవలయును. దాక్షాయణి యోగాగ్నిచే తనువు వీడి పర్వతరాజైన హిమవంతునికి కూతురై జన్మించింది. హిమవంతుని కుమార్తె గావున హైమవతి అని, పర్వతరాజు కుమార్తెగా ఉన్న కారణంగా పార్వతి అని ప్రసిధ్ధి చెందింది. హిమవంతుని ఇంట ఆమె దినదిన ప్రవర్ధమాన మౌతున్న కాలంలో తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ కొరకు కఠోరమైన తపస్సు చేసి సమస్త దేవతలను జయించగల వరములను పొందాడు. ఆ వర ప్రభావంతో లోకాలన్నీ జయించాడు. ఇంద్రుని పదవీ భ్రష్టుడ్ని చేసాడు. స్వర్గాధిపతి అయినాడు. ముక్కోటి దేవతలను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. దేవతలందరూ బ్రహ్మనాశ్రయించి వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మ దేవతలతో "నా వరముల ప్రభావముతోనే వీడు ఇంతటి వాడైనాడు. విష వృక్షమైనా పెంచిపోషించినవాడు చంపరాదని శాస్త్రం. అందుచే నేనేమీ చేయలేను. శివుడు, విష్ణువు కూడా ఏమీ చేయలేరు. దీనికి ఒకటే ఉపాయం ఉంది. ఆదిశక్తి స్వరూపిణి అమ్మవారు హిమవంతుని కుమార్తెగా అవతరించింది. ఆమెను పరమశివుడు వివాహమాడితే వారికి కలిగే సంతానం ఈ రాక్షసుని సంహరిస్తాడు. అందుచే మీరంతా పార్వతీ కళ్యాణం జరపడానికి ప్రయత్నిచండి అని ఉపదేశించారు. దేవతలందరూ సమావేశమైనారు. నారదమహర్షి నావంతు కార్యము నేచేస్తానని బయలుదేరినాడు. ఇంద్రాది దేవతలు మన్మథుని ఈ కార్యము నీవలననే కావాలన్నారు. మన్మథుడు దేవతలు తనకిచ్చిన ప్రాధాన్యతకు సంతసించాడు. వసంతుడు, కోయిలలు వెంటరాగా, రతీదేవితో సహా పరమశివుడు తపస్సు చేస్తున్న హిమాలయ శిఖరాలకు బయలుదేరాడు. నారదులవారు ఒకనాడు హిమవంతుడ్నిచూడగోరి వాని ఆతిథ్యం స్వీకరించి, అక్కడే పెరిగి పెద్దదవుతున్న పార్వతిని చూచి హిమవంతునితో "ఈమె శ్రీ మహారాజ్ఞి లలితాదేవి అమ్మవారు. పరమశివునికి అర్ధాంగి అవుతుంది. నీ శిఖరాలలో తపస్సు చేయుచున్నశివుని సేవకై ఈమెను వినియోగించు మేలు కలుగుతుంది" అని చెప్పాడు. హిమవంతుడు పార్వతిని శివుని సేవకై పంపించాడు. ఆమె సేవలు చేస్తుండగా అక్కడే సమయమునకై వేచియున్న మన్మథుడు శివునికి కామవికారము కలిగేటట్లు పుష్పబాణము సంధించాడు . శివుడు తనలో కలిగిన ఆ కామవికారానికి కారణం తెలుసుకుని ఉగ్రుడై మూడవకన్ను తెరిచాడు. ఎదురుగా ఉన్న మన్మథుడు భస్మమైనాడు. రతీదేవి శోకించింది. పార్వతి తన అందాన్ని తానే నిందించుకుంది. సౌందర్యముతో సాధించలేనిది తపస్సుతో సాధిస్తానని శివుని కొరకై వ్రతము పూనింది. ముత్యాలహారాలు తీసి రుద్రాక్షమాలలు ధరించింది. ఒక చేతిలో రుద్రాక్షమాల, ఒక చేతిలో కమండలము పట్టి, రెండు చేతులు పైకెత్తి నమస్కార భంగిమతో తపస్సు ప్రారంభించెను. తల్లి మేనక ఆ తపస్సు వద్దని "ఉమా, ఉమా" అని పిలిచింది. నాటి నుండి పార్వతి "ఉమా" అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఎవరేమన్నా సరే శివుని సాక్షాత్కరింప చేసుకోవాలని తీవ్రమైన తపస్సు చేస్తోంది. కొంతకాలం ఆహారము తీసుకోవడం మానింది . మరికొంతకాలము పండ్లు తినటం మానివేసి, నీరు మాత్రం పుచ్చుకుంటూ తపమాచరించింది. కొంతకాలము ఆకులు, అలములు తింటూ తపస్సు చేసింది. చివరకు ఆకులు, అలములు తినటం మానివేసింది. పంచాగ్ని మధ్యములో ఒంటి కాలిపై నిలిచి తపస్సు చేస్తూఉంటే, దేవతలు ఆమెను "అపర్ణా, అపర్ణా" అంటూ పిలిచారు. పర్ణము అంటే ఆకు, పర్ణము కూడా తినలేదు కాబట్టి అపర్ణ అన్నారు. (అప గత ఋణ అపర్ణ అనగా ఋణములను పోగట్టునది) ఆమె తపస్సుకు పరమశివుడు మెచ్చాడు. బ్రహ్మచారియై ఆమె చెంతకు వచ్చాడు. ఆమె తపోకారణం గూర్చి అడిగి తెలుసుకున్నాడు. తల్లి తండ్రి లేనివాడు, ఇల్లు వాకిలి లేవు. స్మశాన నివాసి. పుర్రెలు మెడలో ధరిస్తాడు. తోలు కట్టుకుంటాడు. వట్టి అమంగళ వేషుడు. అతని గురించి తపస్సు చేయటం తెలివితక్కువ. నా తపస్సులో సగభాగం ఇస్తాను ఈ తపస్సు నుండి విరమించుకో అన్నాడు. అపర్ణకు కోపం వచ్చింది. శివ నిందాపరుల చెంత ఉండకూడదని అక్కడనుంచి లేచి దూరంగా వెళ్ళిపోయింది. ఇంతలో శివుడు ఆమె చేయి పట్టుకున్నాడు.


పార్వతి కోపంతో ఛీ.. దుర్మార్గుడా అంటూ వెనక్కి తిరిగింది. తీరా చూడపోతే పరమశివుడు ఒక్కసారిగా సిగ్గుపడిపోయింది. తన తపస్సు ఫలించినందుకు మురిసిపోయింది. మెల్లగా తనచేయి వెనక్కి తీసుకుంటూ, స్వామీ! పెద్దలున్నారు మానాన్నగారితో మాట్లాడండి అని చెలికత్తెలతో ఇంటికి వెళ్ళింది. పరమశివుడు పెండ్లిపెద్దలుగా సప్తఋషులను పంపించాడు. అరుంధతి మొదలగు వారితో హిమవంతుని చెంతకు రాయబారం పంపాడు. హిమవంతుడు ఎంతో సంతోషించాడు. తన జన్మ ధన్యమైనదనుకున్నాడు.


ముక్కోటి ముక్కోటి దేవతలు ఒక్కటై మహావైభవోపేతంగా అపర్ణా పరమేశ్వరుల కళ్యాణము జరిపించారు. తర్వాత కుమారస్వామి ఉదయించి తారకాసురుణ్ణి సంహరించి లోకకళ్యాణము గావించాడు. ఈ కథ విన్నవారలకు, చదివినవారలకు కోరిన కోరికలు శ్రీఅపర్ణాదేవి అమ్మవారు స్వయంగా తీరుస్తుంది. అని సూత మహర్షులవారు శౌనకాది ఋషులకు శ్రీఅపర్ణాదేవి అమ్మవారి చరిత్ర తెలియజేసినారు.

 

తృతీయోధ్యాయః సమాప్తః

 

అపర్ణా వ్రతము చేయుటకు అవకాశము లేనివారు రాహుకాల పూజను శుక్రవారం ఆచరించవలెను. ప్రతీ శుక్రవారము ఉదయం గం॥ 10-30ని.ల నుండి 12 గం॥ వరకు ఉండు రాహుకాలములో శ్రీఅపర్ణాదేవి ఆలయమునందు 7 వారములు పూజ చేస్తారో వారికి సర్వాభిష్ట సిద్ధి కలిగి, రాహు, కేతు గ్రహదోష, కాల సర్వదోష నివృత్తి అగును.

 

 

అమ్మ వారి దివ్యక్షేత్ర వివరాలు అపర్ణా అమ్మవారి ఆలయం ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తి అను గ్రామములో కలదు. ఈ గ్రామం అన్నవరం పుణ్యక్షేత్రానికి 20 కి.మీ దూరంలో, సామర్లకోటకు 25 కి.మీ దూరంలో, కాకినాడకు 30 కి.మీ దూరంలో కలదు.