telugu_foreword_content
Sreemaparna

వ్రత విధానకర్త


ఇది తాటిపర్తి వాస్తవ్యులు శ్రీ ఆకొండి వేంకటేశ్వర శర్మ గారి సంకల్పం. దాదాపు ఒక సంవత్సరం క్రితం వారితో నాకు గుంటూరులో పరిచయభాగ్యం కలిగింది. ఆ పరిచయంతోనే వారొకనాడు మా ఇంటికి వచ్చి తాటిపర్తిలో ప్రతిష్టించిన శ్రీ అపర్ణాదేవి అమ్మ వారి మహత్తును గూర్చి చెప్పి, ఆ దేవి పూజాకల్పము తయారు చేయవలసినదిగా కోరారు. వారి కోరిక మేరకు ఈ శ్రీ అపర్ణాదేవి అమ్మ వారి వ్రతకల్పం సంకలనం చేసాను. దీనితో పాటు ముందుగా గణపతి పూజ కూడా చేర్చడం జరిగింది.

కుజుని జన్మ వృత్తాంతం, అపర్ణాదేవి అమ్మ వారి చరిత్ర పూర్తి వ్యావహారిక భాషలో చివర చేర్చాను. దీనికి బహుపురాణజ్ఞులు శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు ఆశీస్సులందించడం నా అదృష్టం. ఇంతటి అదృష్టానికి కారణభూతులైన శ్రీ ఆకొండి వేంకటేశ్వర శర్మ గారికి కృతజ్ఞుడను.


- మల్లంపల్లి అమరేశ్వరప్రసాద్,
కాకినాడ, ది. 8-2-2003.శ్రీలంకలో అంతర్జాతీయ జ్యోతీష్య సమ్మేళనంలో శ్రీ ఆకొండి వేంకటేశ్వర శర్మ గారి ప్రసంగం

సంకల్పకర్త


"శివ శక్త్యాయుక్తోయది భవతి శక్తః ప్రభావితుం" అంటారు ఆదిశంకరులు. అమ్మ వారి అనుగ్రహం లేనిదే అయ్యవారు ఏమీ చెయ్యలేరు అని అర్ధం. ఆ అమ్మ అనేక రూపాలలో ఆవిర్భవింపబడుతూ వుంటుంది. మా స్వగ్రామం తాటిపర్తిలో అమ్మ అపర్ణాదేవిగా అవతరించింది. కుజునకు అధిష్టానదేవత అపర్ణయగుటచే ఆమె ఆరాధన కుజగ్రహ దోష నివారణమని సుప్రసిద్ధము. అందుచే నేను మున్ముందుగా మా సమీపబంధువుల కుమార్తెచే మంగళవారము పూజ చేయించితిని. ఆమెకు వివాహమై సుఖజీవనము సాగించుచున్నది. తరువాత అనేకమంది కన్యలు అపర్ణాదేవి అమ్మ వారిని అర్చించుట, వివాహితులగుట జరిగి, అమ్మ ప్రభావము అనేకమందికి తెలిసి సుప్రకటితమైనది. అందుచే ఈ అమ్మ వారి గురించి ఆలోచన చేయుచుండగా వచ్చినటువంటి రూపమే ఈ క్రింది రూపం.


తాటిపర్తిలో అపర్ణా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠకు ముందు శ్రీ ఆకొండి వేంకటేశ్వర శర్మ గారు మొదటిసారిగా వేయించిన అపర్ణా అమ్మ వారి మొదటి చిత్రం


తరువాత శివాలయ నిర్మాణ సంకల్పం జరిగి, అపర్ణా అమ్మ వారి అనుగ్రహము వలన 360 రోజులలో నాగేశ్వర పంచాయతన, దేవతా ప్రతిష్టలలో అపర్ణా అమ్మ వారి ప్రతిష్టయు జరిగి తాటిపర్తి గ్రామం దివ్యక్షేత్రమై వెలుగొందుచున్నది.

ఆశీస్సులు: అస్మద్గురువరేణ్యులు వేదమూర్తులు బ్రహ్మశ్రీ కొల్లూరి శ్రీరామమూర్తి అవధాని, లక్ష్మీసోదెమ్మ దంపతుల ఆశీస్సులు మరియు అస్మన్మాతా పితరులు శ్రీమతి అన్నపూర్ణ, శ్రీ ఆకొండి వేంకట సత్యభాస్కరరావుల దివ్య ఆశీస్సులు నాకు తోడై ఎల్లపుడు ఉన్నాయి.

కృతజ్ఞతలు: శ్రీ అపర్ణా అమ్మ వారి అనుగ్రహమునకు అందరూ పాత్రులు కావాలనే సదుద్దేశముతో శ్రీ నాగేశ్వర పంచాయతన ఆలయములో అమ్మ వారి ఆలయమును నిర్మింపదలచినపుడు, అడిగిన వెంటనే ఆర్ధికసహాయాన్ని అందించిన శ్రీ గ్రంధి గోవిందరాజులు, నాగమణి దంపతులకు, నాతోటి ఆలయకమిటీ మిత్రులకు, పంచాయతన దేవాలయాలు కట్టించడానికి సహకరించిన దాతలకు, మరియు ప్రారంభము నుండి ఈ కల్పము ముద్రించడానికి నేటి వరకూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్న ద్విభాష్యం సోదరులకు (పిఠాపురం) నా కృతజ్ఞతలు.

శ్రీ అపర్ణా అమ్మ వారి పూజావిధానము తయారుచేయించాలని కాకినాడ వాస్తవ్యులు సంస్కృతాంధ్ర పండితులు శ్రీ మల్లంపల్లి అమరేశ్వరప్రసాద్ వారిని కలసి కోరగా వారు అది సంకలనం చేసారు. దానికి సుప్రసిద్ధ పండితులు, మహోపన్యాసకులు ఋషిపీఠం పత్రికాసంపాదకులు శ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు (హైదరాబాద్) వారి దివ్యాశీస్సులనందిచారు. వీరిరువురికీ ప్రత్యేక ధన్యవాదాలు.

శ్రీ మీసాల శ్రీ రామారావు గారు, శ్రీ శ్రీపాద లక్ష్మణరావు గారు, శ్రీ వారణాసి రాజేశ్వరశాస్త్రి గారు, ద్విసహస్రావథాని శ్రీ కడిమెళ్ళ వరప్రసాద్ గారు, శ్రీ అమరేశ్వరప్రసాద్ గారు, సహస్రావథాని శ్రీ పోచనపెద్ది సుబ్రహ్మణ్యం గారు, శ్రీ ఆకొండి వేంకటేశ్వర శర్మ గారు - శ్రీ అపర్ణా వ్రతకల్పం పుస్తకావిష్కరణ సభలో


- దైవజ్ఞరత్న ఆకొండి వేంకటేశ్వరశర్మ,
తాటిపర్తి.
సామవేదం షణ్ముఖశర్మ గారి ఆశీస్సులు


శ్రీ అపర్ణానుగ్రహ ప్రాప్తిరస్తు


మహార్షులు దయామయులు, అతీంద్రియశక్తితో పరమేశ్వర చైతన్యాన్ని దర్శించడమే కాక, ఆ చైతన్యంతో జనులు తరించే విధంగా అనేక సాధనాలను అనుగ్రహించారు. అవి వేదపురాణాగమాలుగా మనకు లభ్యమౌతున్నాయి.

కేవలం కధలవలె కనిపించే పురాణ ఘట్టాలలో - యజ్ఞపరమైన రహస్యాలు, సంకేతాలు, మంత్ర బీజాక్షరాలను నిక్షిప్తం చేసారు. ఆ కధాక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పఠించువారికి, శ్రవణం చేసేవారికి యజ్ఞాచరణఫలం, మంత్రానుష్ఠానఫలం లభించే విధంగా వాటిని రూపొందించేవారు. అందుకే పురాణకథలకు ఫలశ్రుతులు అనేకం చెప్పబడ్డాయి.

సర్వచైతన్య రూపిణి అయిన ఆద్యవిద్యామూర్తి జగదంబిక అనేక నామాలతో, రూపాలతో విలసిల్లుతోంది. నామరూపవర్జితమైన పరబ్రహ్మశక్తి నామరూపధారణ తన అనుగ్రహాన్ని ప్రకటించడానికే, ఒక్కొక్క నామం వెనుక బహ్వర్థాలు, తత్త్వం, మంత్రశక్తి గర్భాకృతమై ఉంది. వీటితో పాటు లీలాకథనం కూడా స్ఫురిస్తుంది.

అలాంటి గొప్ప నామం "అపర్ణ". ఈ నామంలో పలికే శబ్దాలకు గొప్ప శక్తి ఉంది. అందుకే "శ్రీఅపర్ణాయైనమః" అనేది మహామంత్రం. ఇది కుజగ్రహచైతన్యాన్ని ప్రభావితం చేసే శబ్దశక్తి.

కథాపరంగా - శివప్రాప్తి కోసం పర్ణములు సైతమూ వదలి తపస్సునాచరించడం చేత అమ్మకు "అపర్ణ" నామం సిద్ధమయ్యింది. ఈ నామానికి "అపగతఋణా" అనే అర్థం కూడా ఉంది. అంటే - "ఋణ బాధలను తొలగించునది", "ఋణములు లేనిది" అని అర్థాలు చెప్పవచ్చు. లౌకికంగా ఋణబాధల విమోచనం జరగడమేకాక, పరమార్థికంగా కర్మబంధాలను తొలగించడం కూడా ఈ నామమిచ్చే ఇహపరసిద్ది. అంతేకాదు - ఆ పరతత్వం ఏ బంధనములూ లేని నిర్వికార నిరంజనమని కూడా అర్థం. ఋణమోచనశక్తి అంగారకగ్రహానికి సంబంధించినదిగా జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. "మంగళోభూమి పుత్రశ్చ ఋణహర్తా ధన ప్రదః" - అని అంగారకుని నామాలు, నేరుగా గ్రహాన్ని ఆరాధించడం కన్నా, ఆ గ్రహానికి సైతం చైతన్యాన్నిచ్చే పరమేశ్వరశక్తిని అర్చించడం శీఘ్రఫలప్రదం. అందుకే "అపర్ణా" నామోచ్ఛారణ, ఆ నామం ద్వారా ధ్యానింపబడే తపఃస్వరూపిణి అయిన జగదంబారూపధ్యానం అనేక దివ్యఫలాలనిస్తుంది.

శివపురాణంలో శివపార్వతీ కళ్యాణఘట్టానికి ముందు, అమ్మ తపస్సు, కుజగ్రహోత్పత్తి చెప్పడంలో మహర్షి ఉద్దేశం చాలా గొప్పది. ఈ ఘట్టాల పారాయణం కుజదోషాలను పోగొట్టే శక్తి కలది. ఈ కుజునికి కూడా శివపార్వతుల తనయుడైన సుబ్రహ్మణ్యుడే అధిదేవతగా ఉన్నాడు. ఆ తనయుని కోసమే గౌరీశంకరుల కళ్యాణం. అందుకోసమే గౌరీ తపస్సు. ఇలా పరిశీలిస్తే - ఆ తపోమూర్తి వర్ణన సుబ్రహ్మణ్యచైతన్యాన్ని ఆవిర్భావింపచేయడానికే. అందుకే అపర్ణాదేవిని ఆరాధించడం, వివాహ ప్రతిబంధకాలను తొలగించడం, సంతానోత్పత్తికి కారణమవడం, ఋణ బాధలను నివారింపచేయడం.

ఈ ఫలాలను ప్రసాదించే విధంగా తాటిపర్తిలోని సుబ్రహ్మణ్యుని క్షేత్రంలో శివపంచాయతన మందిరం నిర్మింపబడినది. ఋషుల సంకల్పబలం చేతనే బ్రహ్మశ్రీ ఆకొండి వేంకటేశ్వరశర్మ గార్కి ఈ ఉద్దేశం కలిగి ఈ ఆలయ సముదాయం ఏర్పడింది. విభేదాలు లేకుండా అభీష్టదైవాన్ని ఆరాధిస్తూనే, ఇతర దేవతలను కూడా పూజించడం అసలైన హైందవమతం. అదే ఆదిశంకరులు సమన్వయించిన పంచదేవతారాధన. నిజానికి ఇందులో షణ్మతార్చన కూడా దాగి ఉంది. ఆ సరళిలో ఈ దేవాలయం షణ్మత దేవాలయం. క్షేత్రానికి ఆదిశక్తి దైవం సుబ్రహ్మణ్యుడు. అందుకే శివుడు నాగ సహితంగా నాగేశ్వరుడయ్యాడు. అలా శివునితో పాటు శక్తి అపర్ణగా, విష్ణువు లక్ష్మీహయగ్రీవస్వామిగా ప్రతిష్ఠితులవడమే కాక, ఆదిత్యుడు, గణనాథుడు కూడా వెలయింపబడి - ఇది పుణ్యక్షేత్రమయ్యింది. ఆ సుబ్రహ్మణ్య క్షేత్రంలో అపర్ణానామంతో కొలువైన జగదాంబను ఆరాధించి, శాస్త్రం చెప్పిన ఫలితాలను పొందుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

ఇటువంటి నేపథ్యంలో ఈ గ్రంధాన్ని వెలువరించడం హర్షదాయకం. మన ఐహిక పరమార్థక ప్రయోజనాలకోసమే దేవత రూపాల, నామాల, ఉపాసన, ఆ మార్గంలో అపర్ణావ్రతం బహుళవ్యాప్తి జరిగి, ఈతిబాధలను తొలగించాలని ఆశిస్తూ, ఆ జగదంబకు సభక్తికంగా కైమోడ్పుఘటిస్తూ...భవదీయ
సామవేదం షణ్ముఖశర్మ
(ఋషిపీఠం - భారతీయమానసపత్రిక)